Sunday 24 January 2021

కాంగ్రెస్ పార్టీకి కొత్త అధ్యక్షుడు…

 






ఈ ఏడాది జూన్ నాటికి కాంగ్రెస్ కొత్త అధ్యక్షుణ్ని ఎన్నుకోనుంది. ఆయా రాష్ట్రాల శాసనసభ ఎన్నికల తర్వాత పార్టీ అంతర్గత ఎన్నిక నిర్వహిస్తామని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ( సిడబ్ల్యుసి ) శుక్రవారం స్పష్టం చేసింది. ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల తర్వాత పార్టీ అంతర్గత ఎన్నికకు షెడ్యూల్ రూపొందించాలని సిడబ్ల్యుసి పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని అభ్యర్థించింది. సమావేశం దాదాపు మూడున్నర గంటలపాటు జరిగింది. ఇక సిడబ్ల్యుసికి కూడా ఎన్నికలు జరుగుతాయని, అయితే పార్టీ అధ్యక్ష ఎన్నికలకు ముందా, తర్వాతా అన్నది వేచి చూడాలని ఆ పార్టీ నాయకులు కె.సి. వేణుగోపాల్ , రణ్ దీప్ సూర్దేవాలా విలేకర్ల సమావేశంలో వెల్లడించారు .


కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల విభాగం అధ్యక్షుడి ఎన్నికకు ప్రతిపాదించిందని, మే 29 న ఎఐసిసి సమావేశం ఉంటుందని సమాచారం. తేదీల గురించి సిడబ్ల్యుసి చర్చించిందని, అయితే శాసనసభ ఎన్నికల తర్వాత అంతర్గత ఎన్నికలకు షెడ్యూల్ రూపొందించే అధికారం సోనియా గాంధీకి ఇచ్చారని తెలుస్తోంది. మూడు వ్యవసాయ చట్టాల రద్దు, జాతీయ భద్రత- అధికార రహస్యాల చట్టం ఉల్లంఘనపై నిర్ణీత కాల పరిమితి కలిగిన సంయుక్త పార్లమెంటరీ సంఘం ( జెడిసి ) విచారణ , పేద , అణగారిన వర్గాలకు కాల పరిమితితో కూడిన కొవిడ్- 19 టీకాలకు ప్రభుత్వం హామీ ఇవ్వడం అన్న మూడు తీర్మానాలను శుక్ర వారం సమావేశంలో సిడబ్ల్యుసి ఆమోదించింది. ఎలాంటి పరిస్థితుల్లోనూ 2021 జూన్ లో కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు నిర్వహించాలని సిడబ్ల్యుసి నిర్ణయించిందని ఎఐసిసి ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్ అన్నారు. అయితే శాసనసభ ఎన్నికలను బట్టి తేదీల్లో స్వల్ప మార్పు చోటుచేసు కోవచ్చని ఆయన అన్నారు .


కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు మే చివర్లో జరపాలని సిడబ్ల్యుసి సమా వేశంలో చర్చకు వచ్చింది. అయితే సిడబ్ల్యుసి సభ్యులందరూ పార్టీ అంతర్గత ఎన్నికలు శాసన సభ ఎన్నికలతో కలవకూడదని ఏకగ్రీవంగా కాంగ్రెస్ అధ్యక్షురాలికి విజ్ఞప్తి చేశారని వేణుగో పాల్ తెలిపారు. మొత్తానికి ఎఐసిసి ప్లీనరీ సమావేశం ఈ ఏడాది జూన్ చివర్లో జరగనుంది. అలా కాంగ్రెస్ అధ్యక్షుడి ఎన్నిక కూడా జూన్ నాటికి ఒక కొలిక్కి వస్తుంది .


ఎన్నికలు కాంగ్రెస్ రాజ్యాంగాన్ని అనుసరించి జరుగుతాయని, అయితే సిడబ్ల్యుసి ఎన్నికలు అధ్యక్షుడి ఎన్నికకు ముందా తర్వాతా అన్న విష యంలో కొంత స్పష్టత అవసరం అని వేణుగో పాల్ తెలిపారు. సాధారణంగా అధ్యక్ష ఎన్నికల తర్వాతే సిడబ్ల్యుసి ఎన్నికలు ఉంటాయన్నారు వేణుగోపాల్. ఇక పార్టీ అంతర్గత ఎన్నికలకు డిమాండ్ చేస్తున్నవారి వాదనను రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్ తిప్పికొట్టారు. దీనిని పార్టీ అధ్యక్షులకు వదిలిపెట్టి నరేంద్ర మోడీ నాయకత్వంలోని బిజెపితో పోరాటం ఎలా అన్నదానిపై దృష్టిపెట్టాలని గెహ్లాత్ సూచించారు. అయితే ఈ సందర్భంగా ఆయన మాట “ అగౌరవంగా ” ఉందని పార్టీ సీనియర్ నాయకుడు ఆనంద్ శర్మ వ్యాఖ్యానించినట్లు సమాచారం. దృశ్య మాధ్యమం ద్వారా జరిగిన ఈ సమావేశానికి సోనియా గాంధీ అధ్యక్షత వహించారు .

No comments:

Post a Comment