Monday 12 October 2020

కేబినేట్ లోకి కల్వకుంట్ల కవిత: నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఘన విజయం.



            Image Source: Twitter / @RaoKavitha

తెలంగాణ ప్రభుత్వం నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎందుకంటే తెలంగాణ సీయం కె. చంద్రశేఖర్ రావు గారి కూతురు కవిత ఈ ఉపఎన్నిక బరిలో నిలవడమే. ఇంతకుముందు నిజామాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి బిజేపి అభ్యర్థి చేతిలో ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. దీనితో  ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం, ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ సత్తా చాటుకోవాలని నిర్ణయించుకుంది. దీనితో ఎన్ని రకాల ప్రయత్నాలు చెయ్యొచ్చో అన్ని రకాల ప్రయత్నాలు చేసిందని చెప్పొచ్చు.

నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో  మొత్తం 823 ఓట్లకు గాను 728 ఓట్లను కైవసం చేసుకొని బిజేపి, కాంగ్రెస్ అభ్యర్థులను చిత్తు చేసి కల్వకుంట్ల కవిత నిజామాబాద్ ఎమ్మెల్సీ గా గెలుపొందారు. ఓటమి చెందిన గడ్డ మీదే గెలిచి టిఆర్ఎస్ తన సత్తాను చాటుకుంది. సిఎం కేసిఆర్ కుమార్తె కావడంతో టిఆర్ఎస్ అధిష్టానం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన దగ్గరినుండి మంత్రులతో పాటు, స్థానిక ఎమ్మెల్యేలు అంతా కవిత విజయం కోసం చాలా కృషి చేసారని చెప్పొచు. అయితే ఈ ఉప ఎన్నికను టిఆర్ఎస్ ప్రభుత్వం ఏకగ్రీవంగా భావించి, ప్రతిపక్ష పార్టీల ప్రతినిధులను తమ వైపుకు తిప్పుకుంది. దీనితో బిజేపి, కాంగ్రెస్ కి ఓటమి తప్పలేదు.

ఈ విజయంతో కవిత తెలంగాణ కేబినేట్ లోకి వచ్చినట్టే అని చెప్పుకుంటున్నారు. కానీ తెలంగాణ మంత్రివర్గం అంతా నిండిపోయింది. మరి కవిత కేబినేట్ లో స్థానం ఇవ్వాలంటే, మరొకరు వారి స్థానం నుండి తప్పుకోవాలి. ఇలా చేస్తే పార్టీ వర్గాల్లో భేదాలు వచ్చే అవకాశం ఉండొచ్చు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఈ ఎమ్మెల్సీ పదవి ఇంకా 15 నెలల కాలం మాత్రమే ఉంది. అంటే ఎమ్మెల్సీ పదవీకాలం 2022 జనవరి తో ముగుయనుంది.  మరి కవిత ఈ 15 నెలలు ఎమ్మెల్సీ గా ఉంటారా లేదంటే మంత్రి పదవిని స్వికరిస్తారా అనేది ఇప్పుడు తెలియాల్సి ఉంది.

టిఆర్ఎస్ అధిష్టానం అన్ని రకాలుగా ఆలోచిస్తే, పార్టీ శ్రేణుల మద్య విభేదాలు తలెత్తకుండా ఉండాలంటే  కేబినేట్ లోనే వేరే హోదాలో పార్టీకి సంభందించిన బాధ్యతలను అప్పగించే అవకాశం ఉండొచ్చని పలు రకాల వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే, ఈ ఎన్నికల ద్వారా ఒక విషయం మాత్రం అర్ధమవుతోంది. రాబోయే ఎన్నికల్లో టిఆర్ఎస్ ప్రభుత్వానికి బిజేపి గట్టి పోటీ ఇవ్వబోతున్నట్టు కనిపిస్తోంది. ఎందుకంటే కాంగ్రెస్ తో పోల్చితే బిజేపి వాళ్లకు ఉన్న ఓట్లలో మెజారిటీ ఓట్లను రాబట్టుకోగలిగారు. కాంగ్రెస్ మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది.

No comments:

Post a Comment