దూకుడు రాజకీయాలు , విమర్శలకు గట్టిగా బదులివ్వాలని టిఆర్ఎస్ నిర్ణయించింది. ఆ మేరకు ఎక్కడిక్కడ పార్టీ నేతలు, మంత్రులు కూడా బిజెపికి ప్రతి సవాళ్లు విసరుతున్నారు. బండి సంజయ్ కు ధీటుగా మరింత ఘాటుగా విమర్శలు చేస్తున్నారు. నాలుక చీరేస్తా మంటూ హెచ్చరికలు కూడా చేస్తున్నారు. బాల్క సుమన్ , ఎర్రబెల్లి దయాకర్ రావు, గువ్వల బాలరాజు, కొప్పుల ఈశ్వర్ తదితర నేతలు గట్టిగానే స్పందిస్తున్నారు . సమీప భవిష్యత్తులో వచ్చే ఖమ్మం, వరంగల్, సిద్దిపేట ఎన్నికలన్నింటి లోనూ సత్తా చాటే విధంగా శ్రేణులను కెటిఆర్ సమాయత్తం చేస్తున్నారు. ఈ విమర్శల వెనక కెటిఆర్ ఆదేశాలు ఉన్నాయని తెలుస్తోంది.
ఓ వైపు ఆయన పార్టీ శ్రేణులను హెచ్చరిస్తూనే తనకు తానుగా కేంద్రానికి లేఖలు రాస్తూ నిధుల కోసం డిమాండ్ చేస్తున్నారు. వివిధ రంగాలకు రావాల్సిన నిధులపై బిజెపి నేతలను ఇరుకన పెట్టే విధంగా వరుసపెట్టి లేఖలు రాస్తున్నారు . ఐటిఐఆర్ , చేనేత తదితర రంగాలపై లేఖలు రాసారు . ఇందుకోసం టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు . నిరంతరం జిల్లా నేతలతో టచ్ లో ఉంటూ వారికి సూచనలు చేస్తున్నారు . అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సొంతం చేసుకున్న తెలంగాణ రాష్ట్రసమితి ఇటీవల దుబ్బాక ఉప ఎన్నిక , జిహెచ్ఎంసి ఎన్నికల్లో వరుస ఓటములతో కుదేలయ్యింది . దీంతో పార్టీ అధినేత మార్గదర్శకాల మేరకు కెటిఆర్ ఇందుకు ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేశారు . ప్రజల మద్దతుతో రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన గులాబీ పార్టీకి ఇప్పుడు బిజెపి సవాల్ విసురుతోంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మాజీ మంత్రులు, గెలిచిన ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల బాధ్యులు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులంతా ఉమ్మడిగా కార్యాచరణను సిద్ధం చేస్తున్నారు.
శాసనసభ ఎన్నికల్లో ఓట్లు గల్లంతైన వారిని మళ్లీ చేర్పించడం పై టీఆర్ పార్టీ ప్రధానంగా దృష్టి సారించింది. ఈ క్రమంలో మళ్లీ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ మద్దతు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. గ్రామాల్లో అన్ని వర్గాల ప్రజల ఆదరణను సొంతం చేసుకున్న గులాబీ పార్టీ తోడుంటే ధోకా లేదన్న భరోసా కల్పించేలా క్షేత్రస్థాయిలో నేతలు పథకాల పేరుతో ప్రచారం చేస్తున్నారు. నియోజకవర్గ బాధ్యులు, పార్టీ ముఖ్య నేతలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేల ఆశీస్సుల కోసం ఆశావహులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఆశావహులంతా అధికార పార్టీకి మద్దతు కూడగడుతున్నారు. కాంగ్రెస్, టీజేఎస్, వామపక్ష పార్టీలను ఎక్కడిక్కడ అడ్డుకునేలా విమర్శలకు పదును పెడుతున్నారు . తెలంగాణలోని అన్ని నియోజకవర్గాల పరిధిలో క్యాడర్ బలంగా ఉంది . దీన్ని మరింత బలోపేతం చేసే దిశగా ముందుకు సాగుతున్నారు . రానున్న ఎన్నిక ఏదైనా ఎగరాల్సింది గులాబీ జెండానే కావాలని స్థానిక నేతలకు, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేస్తున్నారు. మొత్తంగా బిజెపిని ఎక్కడిక్కడ నిలువరించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
No comments:
Post a Comment