2020 వ సంవత్సరానికి బై బై చెప్పాల్సిన సమయం వచ్చింది. ఎన్నో ఆశలతో ప్రారంభించిన 2020 సంవత్సరం మనకు చాలా విషయాలు నేర్పించిందనే చెప్పొచ్చు. ప్రకృతి తన అవసరాన్ని గుర్తు చేసింది. ఆర్థిక పరమైన ఇబ్బందుల్లో మనం ఎలా మనుగడ సాగించాలో ఈ సంవత్సరం నేర్పించింది.
ఈ 2020 సంవత్సరం చరిత్రలో నిలిచిపోతుందని చెప్పొచ్చు. దీనికి కారణం కరోనా మహమ్మారి. ఈ వైరస్ వల్ల ప్రపంచం అంతా అతలాకుతలమైంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలు అయింది. ప్రపంచంలోని అన్ని దేశాలు ఈ కరోనా మహమ్మారి బారిన పడినవే. ధనిక, పేద అనే బేదం లేకుండా అందరికి ఈ కరోనా ప్రభావం చూపింది. మన భావి తరాలు కరోనా కి ముందు కరోనా తరువాత అని మాట్లాడుకునే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పొచ్చు.
భారత్ లాంటి అధిక జనాభా ఉన్న దేశంలో ఈ కరోనా వ్యాప్తిని అరికట్టడం అంత తేలికైన విషయం కాదు. కానీ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకొని దేశమంతా లాక్ డౌన్ ని విధించి వ్యాప్తిని అరికట్టడం జరిగింది. దీనితో రవాణా వ్యవస్థ ఎక్కడికక్కడ ఆగిపోయింది. ఎక్కడివారు అక్కడే ఉండిపోవాల్సిన పరిస్థితి. పరిశ్రమలు మూతబడ్డాయి. దీంతో ఆ ప్రభావం రోజూవారి కూలీలపై పడింది. వారికి ఆదాయం లేక ఇబ్బందులు పడడం జరిగింది. వారు తమ సొంత ఊళ్లకు వెళ్ళలేని పరిస్థితి.
50 సంవత్సరాలు పై బడిన వారు ఎక్కువ శాతం ఈ కరోనా బారిన పడి మరణించడం జరిగింది. దీనితో ఆయా కుటుంబాలకు తీరని నష్టం వాటిల్లిందని చెప్పొచ్చు. కొన్ని ప్రాంతాల్లో సరైన సమయంలో వైద్యం అందక పోవడం వల్ల కూడా చనిపోవడం జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా కేసులు మొత్తం 83 మిలియన్ల గా నమోదు కాగా అందులో 46.9 మిలియన్ల మంది కరోనా బారి నుండి బయటబడ్డారు. కాగా మొత్తం మరణాల సంఖ్య 1.81 మిలియన్లగా నమోదైంది.
ప్రపంచ అగ్ర రాజ్యమైన అమెరికా కూడా ఈ కరోనాని అరికట్టలేకపోయిందని చెప్పొచ్చు. ఏ ఒక్క దేశం ఇతర దేశ ప్రయాణికులను తమ దేశంలోకి రాకుండా ఆంక్షలు విధించింది. దీనితో ప్రపంచ వ్యాపార రంగం ఆర్ధికంగా పతనం అయింది.
క్రమక్రమంగా కరోనా వైరస్ ని అధిగమిస్తున్న వేళ, కరోనా రెండో దశ స్ట్రైన్ పేరుతో మరల మొదటి దశని మించిన వేగంతో వ్యాప్తి చెందుతోందని రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఈ కరోనా రెండవ దశ సౌత్ ఆఫ్రికా లో మొదలైంది. దీని ప్రభావం ఎక్కువగా యూరోపియన్ దేశాల్లో ఎక్కువగా ఉండటంతో,ఆ దేశం మరోసారి లాక్ డౌన్ విధించక తప్పలేదు. క్రిస్మస్ వేడుకలను రద్దు చేయడం జరిగింది.
ఈ రెండో దశ కరోనా తో భారత్ అప్రమత్తమైంది. బ్రిటన్ నుండి వచ్చే విమానాలను జనవరి 7 వ తేదీ వరకు రద్దు చేసింది. అలాగే వివిధ రాష్ట్రాల్లో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా రాత్రి పూట కర్ఫ్యూ ని అమలు చేస్తున్నారు.
2021 వ సంవత్సరంలో కరోనా వైరస్ పూర్తిగా అంతమయి, అందరూ తమ జీవనాన్నిసుఖ సంతోషాలతో గడపాలని ఆశిస్తూ ఈ కొత్త సంవత్సరం లోకి అడుగు పెడదాం.
Wish U all Happy New Year 2021.
No comments:
Post a Comment