తెలుగు తెర మరో మంచి నటుణ్ణి కోల్పోయింది. రామ్ గోపాల్ వర్మ స్కూల్ నుంచి వచ్చిన విలన్, హాస్య నటుడు, అందరి హృదయాలను అలరించిన నర్సింగ్ యాదవ్ గురువారం నాడు కన్నుమూశారు. ఆయన వయసు 52 సంవత్సరాలు. హైదరాబాద్ సోమాజిగూడ లోని యశోద ఆసుపత్రిలో కిడ్నీ సంబంధిత వ్యాధితో చికిత్స పొందుతున్న యాదవ్ కి గురువారంనాడు ఆకస్మికంగా గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. 300 పైగా చిత్రాల్లో ఆయన నటించారు. క్షణ క్షణం చిత్రంతో ఆయన బాగా పాపులర్ అయ్యారు .
క్షణ క్షణం, మనీ, మనీ మనీ, ఠాగూర్, ఐతే , పోకిరీ చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. నర్సింగ్ గా తెలుగు ప్రేక్షకులకు ఆయన చిరపరిచితులు. హైదరాబాద్ ఆయన స్వస్థలం. రాజయ్య , లక్ష్మీ నర్సమ్మ దంపతులకు 1968 జనవరి 26 వ తేదీన జన్మించారు. ఆయన సతీమణి చిత్ర యాదవ్. ఆయనకు ఒక కుమారుడు రుత్విక్. హైదరాబాద్ లోని న్యూ సైన్స్ కళాశాలలో ఇంటర్మీడియట్ దాకా చదివారు. రామ్ గోపాల్ వర్మ, ఆయన ఒకే కాలేజీలో చదువుకున్నారు. విజయనిర్మల దర్శక నిర్మాతగా వ్యవహరించి అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ కాంబినేషన్ లో 1979 లో తీసిన హేమాహేమీలు నర్సింగ్ తొలి చిత్రం. అయితే రామ్ గోపాల్ వర్మ క్షణక్షణం చిత్రం ద్వారా ఆయన సినీ జీవితాన్ని ఇచ్చారు .
1991 లో విడుదలైన క్షణక్షణం చిత్రం సంచలనం సృష్టించింది. ఈ చిత్రంలో నర్సింగ్ పేరుతోనే ఆయన చేసిన అద్భుత నటన ఇటు తెలుగు ప్రేక్షకులు, అటు ఇండస్ట్రీ ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి తన ఖైదీ నెంబర్ 150 సహా అనేక చిత్రాల్లో ఆయనకు అవకాశాలిచ్చారు. మాయలోడు ( 1993 ), గాయం ( 1993 ), హైదరాబాద్ ( 2001 ) చిత్రాల్లో నర్సింగ్ పేరుతో చేసిన పాత్రల్లో ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేశారు. అల్లరి ప్రేమికుడు ( 1994 ) లో రౌడీ పాత్రలో, మాస్టర్ ( 1997 ), 2002 లో విడుదలైన వలయం, ఇడియట్ చిత్రాల్లో రౌడీగా, రాజకీయనాయకుడుగ, పోకిరీ చిత్రంలో రౌడీ దాదన్నగా తన నటనతో ఆకట్టుకున్నారు. జానీ, ఠాగూర, సై , శంకర్ దాదా ఎంబిబిఎస్ , మాస్ , అడవిరాముడు , అన్నవరం , దేశముదు , సైనికుడు , యమదొంగ , ఆట , గుండమ్మగారి మనవడు , జగడం , సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ , వియ్యాలవారి కయ్యాలు, ఎటాక్ , ఆటాడిస్తా , ఆలస్యం అమృతం ( 2010 ) వంటి ఎన్నో చిత్రాల్లో ఆయన నటించారు. ఇన్స్ పెక్టర్ రాణా పాత్రలో, దౌడ్ ( 1997 ) అనే హిందీ చిత్రంలో కూడా ఆయన నటించారు. ఆయన మరణం పట్ల ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం, మరో హాస్యనటుడు గుండు సుదర్శన్ ప్రభృతులు సంతాపం తెలియజేశారు .
No comments:
Post a Comment